దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా కొత్త రికార్డును లిఖించింది.ఇప్పటివరకూ టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఆస్ట్రేలియాను సైతం వెనక్కినెట్టింది. స‍్వదేశీ వరుస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. సఫారీలతో టెస్టు సిరీస్‌ను సాధించిన తర్వాత భారత్‌కు ఇది వరుసగా 11వ స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయం. ఈ క్రమంలోనే ఆసీస్ రికార్డును టీమిండియా బద్ధలు కొట్టింది. 1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆసీస్ తమ దేశంలో సాధించిన వరుస టెస్టు సిరీస్ విజయాలు సంఖ్య 10.
ఆపై 2004-09 సీజన్ మధ్యలో ఆసీస్ మరోసారి 10 వరుస స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే ఆసీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా తాజాగా బ్రేక్ చేసింది. 2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 స్వదేశీ టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఫలితంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ జాబితాలో టీమిండియా, ఆసీస్‌ల తర్వాత స్థానంలో వెస్టిండీస్ ఉంది. 1975-76 సీజన్ నుంచి 1985-86 సీజన్ వరకూ వెస్టిండీస్ తమ సొంత గడ్డపై వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ విజయాలు సాధించింది.
2012-13 నుంచి ఇప్పటివరకూ భారత్ స్వదేశంలో సాధించిన టెస్టు సిరీస్ విజయాలు
4-0తేడాతో ఆస్ట్రేలియాపై(2013)
2-0 తేడాతో వెస్టిండీస్‌పై(2013-14)
3-0 తేడాతో దక్షిణాఫ్రికాపై(2015-16)
3-0 తేడాతో న్యూజిలాండ్‌పై(2016)
4-0 తేడాతో ఇంగ్లండ్‌పై(2016-17)
1-0 తేడాతో బంగ్లాదేశ్‌పై(2017)
2-1 తేడాతో ఆసీస్‌పై(2017)
1-0 తేడాతో శ్రీలంకపై(2017-18)
1-0 తేడాతో అఫ్గానిస్తాన్‌పై(2018)
2-0 తేడాతో వెస్టిండీస్‌పై(2018-19)
2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై(2019)

Source: https://www.sakshi.com/news/sports/india-script-world-record-consecutive-series-wins-home-1231976