భారీగా ఆస్తుల కొనుగోలుకు పక్కా ప్లాన్
నిర్మాణ సంస్థకు రూ.4.47 కోట్లు చెల్లింపు
ఐఎంఎస్ స్కామ్లో వెలుగులోకి కొత్త కోణాలు
చిత్రంలో కనిపిస్తున్న ఈ నోట్ల కట్టలు ఐఎంఎస్ స్కాం ప్రధాన సూత్రధారి దేవికారాణి ‘రియల్' స్టోరీని చెప్పే నిదర్శనాలు! ఆమె అవినీతికి తిరుగులేని ఆధారాలు! భారీగా ఆస్తులు కొనుగోలు చేసేందుకు.. తనతో అంటకాగిన ఫార్మసిస్ట్ నాగలక్ష్మితో కలిసి ఐఎంఎస్ డైరెక్టర్గా పనిచేసిన దేవికారాణి పోగుచేసి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెల్లించిన మొత్తాలు! లెక్కపెడితే.. అక్షరాలా నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల పైచిలుకే!
హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోలు స్కాంపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు తవ్వినకొద్దీ అవినీతి పుట్ట బద్దలవుతున్నది. ఐఎంఎస్ డైరెక్టర్గా పనిచేసిన దేవికారాణి, అమెతో అంటకాగిన ఫార్మసిస్ట్ నాగలక్ష్మి పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు భారీ స్కెచ్ వేసినట్టు తేలింది. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ఆరు ఇండ్ల స్థలాలు, 15వేల చదరపు గజాల కమర్షియల్ స్పేస్ కొనుగోలుకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో వీరు ఒప్పం దం కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వివరాలతో ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు లేఖలు రాయగా, వాస్తవమేనని ఆ సంస్థ సమాధానం పంపింది. దేవికారాణి, నాగలక్ష్మి కలిసి ఆస్తుల కొనుగోలు కోసం రియల్ఎస్టేట్ సంస్థకు రూ.4.47 కోట్లు చెల్లించారు. ఈ మొత్తాన్ని ఏసీబీ అధికారులు ఆ రియల్ఎస్టేట్ సంస్థ నుంచి మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదులో రూ.3,75,30,000 దేవికారాణికి చెందినవి కాగా, మిగిలిన రూ.72 లక్షలు నాగలక్ష్మివి అని నిర్ధారించారు. ఈ మొత్తంలో నుంచి దేవికారాణి తన బినామీల పేరిట రూ.22 లక్షలు చెల్లించినట్టు తేలింది.