Delhi Saree Controversy: చీర కట్టుకుని వచ్చిన మహిళకు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు లోపలికి అనుమతి నిరాకరించడం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆదివారంనాడు తనకు ఎదురైన చేదు అనుభవానికి సంబంధించిన వీడియోను బాధిత మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్మార్ట్ డ్రెస్ కాదంటూ చీరకట్టుతో వచ్చిన ఆ మహిళను రెస్టారెంట్ సిబ్బంది లోనుకి అనుమతి లేదని చెబుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. రెస్టారెంట్ నిర్వాకంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. భారత సాంప్రదాయంలో భాగమైన చీరకట్టును అవమానించిన రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమయ్యింది.
ఈ ఘటనపై ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్(NCW) కూడా సీరియస్ అయ్యింది. చీరకట్టుకుని వచ్చినందుకు మహిళకు ప్రవేశాన్ని నిరాకరించిన రెస్టారెంట్ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ రెస్టారెంట్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. రెస్టారెంట్ సిబ్బంది ప్రవర్తన, డ్రెస్సింగ్ కోడ్‌కు సంబంధించి రెస్టారెంట్ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహిళా కమిషన్ పేర్కొంది.