తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో 274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో 84 కేసులకు చేరింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణలో 3779 కరోనా యాక్టివ్ కేసులు వున్నాయి. మొత్తం 21,679 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 274 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.
మరోవైపు తెలంగాణలో కేసుల తీవ్రత పెరిగితే లాక్ డౌన్, కర్ఫ్యూ గురించి ఆలోచిస్తామన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. జనవరి చివరి వారంలో లాక్ డౌన్ వుండవచ్చంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా మూడో దశ ప్రమాదం కాకపోయినా.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం టీకా అందిస్తున్న కేంద్రాల్లో 15 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. పిల్లలకోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఈ వయసు వారికి టీకాలు ఇవ్వటం కాస్త సెన్సిటివ్ విషయంగా పేర్కొన్న సర్కార్.. పిల్లలతో పాటు.. తల్లిదండ్రులు వెంట ఉండాలని కోరింది. 0.5 ఎంఎల్ డోస్ కొవాగ్జిన్ టీకాను పిల్లలకు ఇస్తున్నట్లు తెలిపింది. టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సినేషన్ కేంద్రంలో వేచి ఉండాలని సూచించింది. పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలోనే టీకా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది.