Pan Card And Aadhaar Link: మీకు పాన్ కార్డు ఉందా.? ఆధార్ నెంబర్‌తో దానిని లింక్ చేశారా.? లింక్ చేయకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందుకే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేసేందుకు సెప్టెంబర్ 30తో గడువు ఉండేది. ఇప్పుడు ఆ గడువును పొడిగించింది. పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువును మార్చి 31, 2022 వరకు పొవడిగించింది కేంద్రం. ఇందుకు గతంలో నిర్దేశించిన గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సింది. కరోనా కాలంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరో ఆరు నెలల సమయం కల్పిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు, ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేసేందుకు సైతం గడువును ఈ నెల 30 నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు పొడిగించింది. ‘బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం, 1988’లో భాగంగా తీర్పు ఇచ్చే అధికారి నోటీసులు, ఆదేశాల జారీకి కాలపరిమితిని సైతం వచ్చే మార్చి వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది.
కాగా, ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్ చేయడం, డీమ్యాట్ ఖాతా తెరవడం, స్థిరాస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో లావాదేవీలు వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. పాన్ కార్డు అనేది దేశంలో తప్పనిసరి. ఇందులో భాగంగా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయడం ఎంతో ముఖ్యంగా. కేంద్రం ప్రభుత్వం ఈ రెండింటిని లింక్ చేసేందుకు ఎన్నో సార్లు గడువు పొడిగిస్తూ వస్తోంది. చివరిగా ఈ నెలాఖరుతో గడువు పూర్తి ఉండగా, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది మార్చి నెల వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాన్‌తో ఆధార్ అనుసంధానం చేయని వారికి ఎంతో ఊరటనిచ్చినట్లయింది.